Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2024, 5:52 pm Posted by : ramakrishna

పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యం

. . . నిజామాబాద్ లో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

. . . వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోధర రాజా నర్సింహ

 నిజామాబాద్, బతుకమ్మ..

వైద్యం కోసం ఎదురుచూసే పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జిల్లాలో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య చికిత్స కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25శాతం వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే జనరల్ ఆస్పత్రిలో సుమారు రూ.7కోట్ల సివిల్ వర్క్ పనులు, లిఫ్ట్ రిపేర్లు ఉన్నాయని, వాటిని కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఉగాది లోపు పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో అవసరమున్న చోట పీహెచ్‌సీలను నెలకొల్పుతామన్నారు. జనాభా ప్రకారం గ్రామీణ స్థాయిలో సబ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసే విధానాన్ని అమలులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్రంలో ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య సేవల విషయంలో నిజామాబాద్ జిల్లాకు ఇదివరకు ఎంతో మంచి పేరు ఉండేదని, ప్రస్తుతం కూడా వైద్యులు, సిబ్బంది అందరూ అంకితభావం, నిబద్దతతో పనిచేస్తూ పూర్వ ప్రతిష్టను పునరుద్ధరింపజేయాలని సూచించారు. ప్రభుత్వపరంగా ఎన్ని సదుపాయాలు కల్పించినా, వైద్య సేవల్లో లోపాలు ఉంటే ప్రయోజనం శూన్యంగా మారుతుందన్నారు. పేదలకు మెరుగైన సేవలు అందించడమే పరమావధిగా ప్రతి ఒక్కరు సేవా తత్పరతతో విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హితవు పలికారు. ప్రభుత్వ వైద్యులు విధులకు ఎగనామం పెట్టి ప్రైవేట్ క్లినిక్ లు, ప్రైవేట్ ప్రాక్టీస్ లకు పరిమితమైతే సహించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహణపరమైన లోపాలను సరిదిద్దుకుని, వచ్చే ఉగాది నాటికి వంద రోజుల్లోపు పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించేలా అంకితభావంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, భూపతి రెడ్డి,  పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర సహకార లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నూడా ఛైర్మన్ కేశ వేణు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,అడిషనల్ కలెక్టర్ అంకిత్, సూపరింటేండేంట్ డా. ప్రతిమరాజ్ తదితరులు పాల్గొన్నారు.