బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మినార్‌పల్లిలో భర్తను భార్య హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుడైన దేశ్య నాయక్‌ను అతని భార్య సాలుబాయి గొంతుకోసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. భార్యాభర్తల మధ్య ఇటీవల విభేదాలు ఎక్కువవుతున్నట్టు సమాచారం. శుక్రవారం రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి నుంచి అరుపులు, కేకలు వినిపించడంతో పక్కనే ఉన్న వారు అక్కడికి పరుగెత్తారు. అప్పటికే దేశ్య నాయక్ తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తక్షణమే స్థానికులు బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించినా, చికిత్స పొందుతూ దేశ్య నాయక్ మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బోధన్ రూరల్ పోలీసులు నిందితురాలైన సాలుబాయిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చెందర్ రెడ్డి తెలిపారు.