Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2024, 10:20 pm Posted by : ramakrishna

అవినీతి కూసలు కదులుతున్నాయి

  • మెల్లిమెల్లిగా డీజీపీ ఆదేశాలు అమలు 
  • ఇసుక, మొరం అక్రమార్కులకు వెన్నుకాసిన వారిపై చర్యలు
  • లూప్ లైన్ పంపుతున్న అధికారులు 

బతుకమ్మ, నిజామాబాద్ : బాసర జోన్ – 2 పరిధిలో 24 మంది ఎస్సైలను బుధవారం బదిలీ చేశారు. అందులో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాకు చెందిన ఎస్సైలు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్, నందిపేట్ ఎస్ హెచ్ వోలను వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ జితేంధర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా లూప్ లైన్ కు బదిలీ చేయాల్సిన వారిలో మొదటి స్థానంలో ఉన్న వేల్పూర్ ఎస్ హెచ్ వో నాగనాథ్ ను మూడు నెలల తర్వాత వీఆర్ కు పంపడం విశేషం.

నిజామాబాద్ జిల్లాలో ఇసుక, మొరం అక్రమ రవాణాదారులతో అంటకాగిన పోలీసు అధికారులపై వేటు పడుతుంది. ఆలస్యంగా స్పందించిన అధికారులు ఒక్కొక్కరిగా  లూప్ లైన్ కు పంపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మంజిరా పరివాహక ప్రాంతంలో ఇసుక వాగులు, వంకల్లో ఇసుకను తవ్వి  సొమ్ము  చేసుకుంటున్న వారితో సిఐ, ఎస్సైలు మిలాఖత్ అయి ప్రతి నెల మామూళ్లు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసు బాసుకు నివేదిక అందజేశారు. ట్రాక్టర్ కు రూ.10 వేలు చొప్పున తీసుకున్న వారు కొందరైతే,  ప్రతి నెల రూ.2 లక్షల నుంచి 8 లక్షల వరకు మామూళ్ళు గుంజారు. డీజీపీ ఆదేశాలతో అక్టోబర్ 4న  నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, 10 మంది  ఎస్సైల అవినీతి చిట్టా బయటకు వచ్చిన విషయం తెల్సిందే. అయితే పోలీసు కమిషనర్ ఉత్తర్వులను అమలు చేయకముందే కల్మేశ్వర్ సింగేవార్ బదిలీ అయిన విషయం తెల్సిందే.

తొలుత భీంగల్ సిఐగా ఉన్న శ్రీనివాస్ కు స్థానచలనం కల్పించారు. తర్వాత బోధన్ టౌన్ లో పని చేస్తున్న ఎస్ హెచ్ వో వీరయ్యను ట్రాఫిక్ కు బదిలీ చేసిన అధికారులు తర్వాత వీఆర్ కు పంపారు. వర్నిఎస్సై క్రిష్ట నవంబర్ లో ఏసీబీకి చిక్కారు. జక్రాన్ పల్లి , ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, పోతంగల్,  రుద్రూర్, రెంజల్, మాక్లూర్ ఎస్సైలకు విడతల వారీగా నాన్  ఫోకల్ పోస్టులకు పరిమితం చేసే పనులకు పోలీసు శాఖ సిద్దపడుతుంది. ఖద్దర్  నేతల ద్వారా  పోస్టింగ్ తెచ్చుకున్న వారిపై చర్యలకు మొదట మీనమేషాలు లెక్కించినప్పటికీ మెల్లిమెల్లిగా కొరడా ఝళిపిస్తుంది. ఇప్పటికే డీజీపీ వద్ద ఉన్న జాబితా ప్రకారం వారందరినీ  లూప్ లైన్ కు పంపించే ప్రక్రియ కొనసాగుతుంది.