Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 5:58 pm Posted by : ramakrishna

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత

 

. . . తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ

 

. . . రూ. 1.71 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని, పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలంగాణ ప్రభుత్వ సలహా దారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 171 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ.1,71,19,836 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారం కాకూడదనే లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా 118 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ పథకం కింద రూ.1,18,13,688, 53 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.53,06,148 చొప్పున మొత్తం రూ.1,71,19,836 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అనేక కీలక హామీలను అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశ వేణు, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

The welfare of the poor is the government's top priority.