Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 7:30 pm Posted by : ramakrishna

కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి

 

. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల మేర గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్ హౌస్‌లను వెంటనే ఆన్ చేసి నీటిని ఎల్లంపల్లికి తరలించి, అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్ఆర్ఎస్ పి)ను నింపాలని ఆయన సూచించారు. ఈ విధంగా చేస్తే నిజామాబాద్, బాల్కొండ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వర్షాలు తగ్గిపోవడంతో ఎస్ఆర్ ఎస్ పి లో నీటి నిల్వలు తీవ్రంగా తగ్గాయని, దీంతో పలు నియోజకవర్గాల్లో రైతులు సాగు పనులు ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక గ్రామాలు గుత్ప, అలీసాగర్ వంటి ప్రాజెక్టులపై ఆధారపడి జీవిస్తున్నాయని, నీటి కొరత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం కె. చంద్రశేఖర్ రావు హయాంలో చేపట్టారని గుర్తుచేసిన ఆయన, ఇది కేవలం ఒక బ్యారేజ్ కాకుండా అనేక రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లు, కాలువలతో కూడిన భారీ ఎత్తిపోతల వ్యవస్థ అని వివరించారు. అలాంటి వ్యవస్థను ఉపయోగించకుండా నిలిపివేయడం రైతులకు అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులో లోపాలున్నాయన్న కారణంతో మొత్తం వ్యవస్థను నిలిపివేయడం సరైంది కాదని పేర్కొన్నారు. పంప్ హౌస్‌లను తక్షణమే ప్రారంభించి సాగునీరు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రతిష్టకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ఆరోపించారు. వెంటనే కన్నెపల్లి సహా అన్ని పంప్ హౌస్‌లను ప్రారంభించి నీటిని వినియోగంలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే రైతులతో కలిసి స్వయంగా చర్యలు తీసుకునే స్థాయికి ఉద్యమం తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో సాగునీటి సమస్యలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కాళేశ్వరం జలాల వినియోగంపై రాజకీయ వివాదం మరింత వేడెక్కుతోంది.

 

The waters of the Kaleshwaram project must be brought into use immediately.