Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 6:01 pm Posted by : ramakrishna

రణభేరి ప్రజల కోసం కాదు

 

. . . రాజకీయ ఉనికి కోసం చేసిందే

 

. . . నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వహించిన ‘రణభేరి’ కార్యక్రమం ప్రజల కోసం కాకుండా రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేపట్టిన కార్యక్రమమని నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రణభేరి సభలో ఎంపీ అర్వింద్ చేసిన ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ బాండ్ పేపర్ రాసి రైతులకు హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్, ఆ హామీని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. నిజామాబాద్ పసుపు రైతులకు ఇప్పటివరకు జరిగిన న్యాయం ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర, రైతుల సమస్యల పరిష్కారంలో ఎంపీ వైఫల్యం చెందారని పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు ఏమిటో ప్రజలకు చెప్పాలని రామకృష్ణ ప్రశ్నించారు. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలు, స్థానిక నాయకులపై వ్యక్తిగత విమర్శలకే ఎంపీ పరిమితమయ్యారని అన్నారు. జిల్లాలో కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించిన ఆయన, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రజలు చైతన్యవంతులని, ఎన్నికల సమయంలో చేసే ప్రచారాలతో వారిని తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదని అన్నారు. తమకు కూడా వ్యక్తిగతంగా విమర్శించే అవకాశం ఉన్నప్పటికీ, దివంగత కాంగ్రెస్ నాయకుడు డి. శ్రీనివాస్ వద్ద నేర్చుకున్న రాజకీయ విలువలు, సంస్కారం కారణంగా అలాంటి భాషను ఉపయోగించబోమని రామకృష్ణ పేర్కొన్నారు. గాంధేయవాదమే కాంగ్రెస్ సిద్ధాంతమని, కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలపై స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ‘ఛాత్రోస్ కి గూంజ్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన, భరోసా కల్పిస్తుంటే, రణభేరి పేరుతో విద్యార్థుల్లో అయోమయం, అభద్రత భావన పెంచుతున్నారని విమర్శించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై స్పందించకుండా విద్యార్థుల పక్షాన ఉన్నట్లు మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ మాట్లాడుతూ, నిజామాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు. గత ఏడు సంవత్సరాల్లో కేంద్రం నుంచి జిల్లాకు గణనీయమైన నిధులు లేదా అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురాలేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర నిధులు సాధించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. 2004–2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వంటి అభివృద్ధి పనులే ఇప్పటికీ కనిపిస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వం జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్‌తో పాటు జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, డీసీసీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు విజయపాల్ రెడ్డి, సయ్యద్ సలీం, జెండాగుడి ఛైర్మన్ లవంగ ప్రమోద్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెయిన్, అధికార ప్రతినిధి గోవర్ధన్, కార్యదర్శులు హర్షద్, వహీద్, ఆకుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 

The war drums are not for the people.