Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 5:55 pm Posted by : ramakrishna

గ్రామ సర్పంచ్ ఎప్పుడు అందుబాటులో ఉండరు

 

. . . వార్డులలో తీవ్రంగా నెలకొన్న సమస్యలు

 

. . . సమస్యల గురించి పట్టించుకోని సర్పంచ్, సెక్రటరీ

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలోని పలు వార్డులలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సమస్యలు తీవ్రంగా నెలకొన్నాయని వార్డు మెంబర్లు పేర్కొన్నారు. గురువారం సులేమాన్ నగర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్లు మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ అఫ్రిన్ బేగం ఎప్పుడు చూసిన ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, సర్పంచ్ గా గెలుపొందినప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి రాలేదన్నారు. వార్డులలో నెలకొన్న సమస్యల గురించి పంచాయతీ సెక్రటరీ సోఫికి పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని వార్డు మెంబర్లు సెక్రటరీ పై తీవ్రంగా మండిపడ్డారు. గ్రామంలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని, మురికి కాలువల్లో చెత్తాచెదారం చేరి అధ్వానంగా మారాయన్నారు. అదేవిధంగా రాయకూర్ గ్రామానికి వెళ్లే రహదారి ప్రక్కన ఉన్న పల్లె ప్రకృతి వనం కబ్జాకు గురైందని, ఆ స్థలంలో గేదెలను కట్టివేస్తూ, ఇటుక డంపులు చేస్తున్నారని ఈ సమస్య గురించి సెక్రటరీకి విన్నవించి 15 రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులలో నెలకొన్న సమస్యల పై సెక్రటరీకి విన్నవిస్తే పట్టించుకోకుండా తమకేమిలే అన్నచందంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ సమస్యల గురించి సర్పంచ్ కు ఫోన్ చేయమని సెక్రటరీకి చెపితే, మాజీ సర్పంచ్ కు ఫోన్ చేసి చెప్తున్నాడని, సర్పంచ్ ఫోన్ నెంబర్ అడిగితే లేదని, సర్పంచ్ ఎవరో కూడా నాకు తెలియదు అని సెక్రటరీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామ సర్పంచ్, సెక్రెటరీ పై చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్లు కోరారు. ఈ సమావేశంలో వార్డు మెంబర్లు అయస్, షఫీ, విజయ్, రఫిక్, జావిద్, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

 

The village sarpanch is never available.