Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 9:28 pm Posted by : ramakrishna

పలుగు పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి

 

. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించాలని, పలుగు, పార పట్టిన చేతులే.. కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. చదువొక్కటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చదువే సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుందని విద్యార్థులకు ఉద్బోధించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనానికి బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావ, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు విద్యార్థినులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో  విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి 9 రకాల వస్తువులతో కూడిన కిట్లను అందిస్తామని ప్రకటించారు. రూ. 1000 కోట్లకుపైగా ఖర్చు పెట్టి, ఆగస్టు 15వ తేదీ లోపు రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లను ఇవ్వబోతున్నాం. అవి అందుకున్న తర్వాత.. మీకు వచ్చిన వస్తువులు బాగున్నాయా? లేదా వాట్సాప్ వేదికగా చెప్పడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకపోతే వందేళ్లయినా సమస్య పరిష్కారం కాదు. అందుకే ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాం.

 

The very hands that wielded the crowbar must now wield the pen to transform the destiny of Telangana.

 

ప్రభుత్వ పాఠశాల ప్రతిష్టను పెంచడానికి నిరంతరం పనిచేస్తున్నాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని శపథం తీసుకుని పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ఒకటి రెండేళ్లలో మొత్తం వ్యవస్థ బాగుపడుతుందని భావించడం లేదు. కొంత సమయం పడుతుంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులకు 16 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, పదేండ్లుగా జరగని బదిలీలను చేపట్టాం. ప్రశాంతంగా చదువు చెబుతారన్న ఆలోచనతో 317 జీవోను అమలు చేసి చెదిరిపోయిన కుటుంబాలను ఒకచోట చేర్చాం. విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. అందుకే కేంద్ర విద్యా శాఖ ప్రకటించిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 36వ స్థానం నుంచి 18వ స్థానానికి ఎదిగాం. దీంతో సంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. మొదటి రెండు స్థానాలు సాధించే వరకు నిరంతరం పనిచేయాలి. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రతిభ కనబరిచిన టీచర్లకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచంలో మంచి విద్యావిధానం అమలు చేస్తున్న దేశాల్లో అధ్యయనం కోసం 50 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపించామని, వచ్చే ఏడాది 150 మంది టీచర్లను పంపిస్తామని చెప్పారు. ఏఐ విప్లవం వచ్చిన తర్వాత వైట్ కాలర్ జాబ్స్ పోయే ప్రమాదమొచ్చింది. అందుకే యువతలో స్కిల్స్ పెంచి బ్లూ కాలర్ జాబ్స్ అందించేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. విద్యార్థులకు జర్మన్, జపనీస్ లాంటి భాషలను నేర్పించాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ నిర్మాణంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించాలి. ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన ఈ పిల్లలే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా రాణించాలన్నారు. చదువులో రాణించలేని వారు మైదానాల్లో రాణించాలని కోరారు. క్రీడల్లో అత్యుత్తుమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ. 1.08 లక్షలు ఖర్చు పెడుతోంది. ఇంత మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పుడు కచ్చితంగా బాగా చదువుకుని నిరూపించుకోవాలని ఉద్బోధించారు.

 

The very hands that wielded the crowbar must now wield the pen to transform the destiny of Telangana.