. . . నిజామాబాద్‌లో ఓంకార్ శత జయంతి సభ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు, సామాజిక శక్తుల ఐక్యతే దేశానికి ప్రత్యామ్నాయం అని ఎంపిసిఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మద్ది కాయల ఓంకార్ శతజయంతి సందర్భంగా నగరంలోని యాదగిరి బాగ్, వినాయక నగర్‌లో బుధవారం సభ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కర్రోల్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథి రవి మాట్లాడుతూ, ఓంకార్ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని గుర్తుచేశారు.

ఒక్క కమ్యూనిస్టు పార్టీతోనే విప్లవం సాధ్యం కాదని, వర్గ–సామాజిక శక్తుల ఐక్యత ద్వారానే నిజమైన ప్రజా రాజ్యం సాధ్యమని ఆయన అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో అనుసంధానం చేయడాన్ని ఆయన విమర్శిస్తూ, ఇది ప్రజల దృష్టి మళ్లించే చర్య అని పేర్కొన్నారు. మహిళల రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఇతర వక్తలు నూనె వెంకటస్వామి, దండి వెంకట్ మాట్లాడుతూ అంబేద్కర్, పూలే, పేరియార్ ఆలోచనలతో వర్గ–కుల ఐక్యతను బలోపేతం చేయాలని, మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడటమే ఓంకార్ కి నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ (యు) కేంద్ర కమిటీ సభ్యులు వల్లేపు ఉపేందర్ రెడ్డి, ఎఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు, సీపీఐఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, యుఎస్ఎఫ్ఐ కార్యదర్శి పెద్ది సూరి, ఎంసీపిఐ (యు) కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం. జబ్బర్ నాయక్, ఎంసీపీఐ (యు) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, ఎఐపీఎస్యు జిల్లా కార్యదర్శి అనిల్ ఎఐఎఫ్డిఎస్ జిల్లా నాయకులు ఎం.బిక్షపతి, జిల్లా నాయకులు, వివిధ మండలాల నాయకులు, మహిళా నాయకురాలు లు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
