Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 3:35 pm Posted by : ramakrishna

యూజీడీ పనుల్లో జాప్యం జరుగకుండా త్వరితగతిన పూర్తి చేయాలి

 

. . . అసంపూర్తి వివరాలతో అధికారులు సమావేశాలకు హాజరుకావడం పై ఎంపీ అర్వింద్ ఆగ్రహం

 

నిజామాబాద్,బతుకమ్మ :

 

యూజీడీ పెండింగ్ పనుల్లో జాప్యం జరుగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్వో గీత, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మేయర్ ఉమారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించి ఆర్‌అండ్‌బీతో పాటు వివిధ శాఖల అధికారులు అసంపూర్తి సమాచారంతో సమాధానాలు ఇవ్వడంపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అభివృద్ధి పనికి సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేసుకొని సమావేశానికి రావాలని, పనుల పురోగతిపై స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు. యూజీడీ అభివృద్ధి పనులు ఎంతవరకు పూర్తయ్యాయని, పెండింగ్ పనుల పురోగతి ఏమిటని ఎంపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా కొంత ఆలస్యమైందని అధికారులు వివరించారు. ఫిబ్రవరిలోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పనుల్లో మరింత జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు. యూజీడీ పనుల్లో కొంత నాణ్యత లోపిస్తోందని, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమావేశంలో ప్రజాప్రతినిధులకు కనీస ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మూర్‌లో ఇటీవల నిర్వహించిన రైతు వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించలేదన్నారు. జిల్లా కలెక్టర్ హాజరయ్యే అధికారిక కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.