Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 3:26 pm Posted by : ramakrishna

రైల్వే బ్రిడ్జి ట్రాఫిక్ డైవర్షన్‌ను దీపావళి వరకు వాయిదా వేయాలి

 

. . . పండుగల వేళ ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దు

 

 . . . నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని విజయ టాకీస్ పక్కన ఉన్న రైల్వే బ్రిడ్జి విస్తరణ పనుల్లో భాగంగా ఆదివారం నుంచి అమలు చేస్తున్న ట్రాఫిక్ డైవర్షన్‌ను దీపావళి పండుగ వరకు వాయిదా వేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. దసరా పండుగకు కేవలం మూడు రోజుల ముందు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో నిజామాబాద్‌కు వచ్చి పండుగ కొనుగోళ్లు చేస్తుంటారని తెలిపారు. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో కొత్తగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం ప్రజలకు మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ కారణంగా వ్యాపారులు, చిరు వ్యాపారులు, వాహనదారులు, పండుగ కొనుగోళ్ల కోసం వచ్చే కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. పండుగల సమయంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులకు మేము వ్యతిరేకం కాదని, కానీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలి అని గణేష్ బిగాల స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, రైల్వే శాఖ అధికారులు సమన్వయంతో చర్చించి, దసరా మరియు దీపావళి పండుగలు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ డైవర్షన్‌ను వాయిదా వేయడంతో పాటు, బ్రిడ్జి విస్తరణ పనుల విషయంలో తగిన ప్రణాళిక రూపొందించాలని కోరారు. ప్రజల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని, పండుగల సమయంలో ప్రజలను ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులకు గురిచేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని గణేష్ బిగాల డిమాండ్ చేశారు.