Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 7:37 pm Posted by : ramakrishna

బంగారు వ్యాపారుల నెత్తిన పిడుగు

  • రూ.15 కోట్లకు టోకరా వేసిన హోల్ సేల్ వ్యాపారి
  • బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదుకు వెనుకంజ
  • ముంబాయి, గుజరాత్ నుంచి కిలోల కొద్ది బంగారం రవాణా దందాలో ట్విస్టు

 

నిజామాబాద్, బతుకమ్మ : బంగారు గొలుసులను హోల్ సేల్ గా సరఫరా చేసే వ్యాపారి ఒకరు తోటి వ్యాపారులకు ఝలక్ ఇచ్చారు. ముంబాయి, గుజరాత్ ల నుంచి జీరోలో కిలోల కొద్ది బంగారు నగలను తీసుకువచ్చి సరఫరా చేసే వ్యాపారి దాదాపు రూ.15 కోట్లకు టోపి పెట్టాడు. దశాబ్ధాలుగా బంగారాన్ని ఎలాంటి పన్నులు చెల్లించకుండా ముంబాయి, గుజరాత్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రిటైల్ వ్యాపారులకు సరఫరా చేసే వ్యక్తి ఈ నెల మొదటి వారం నుంచి  కనిపించకుండా బిచాన ఎత్తేశాడు. దానితో నిజామాబాద్ నగరంలోని గాంధీగంజ్, కుమార్ గల్లి బంగారు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్, భైంసా, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, ధర్మాబాద్, ముథోల్, నిర్మల్ జిల్లాల రిటైల్ వ్యాపారులకు బంగారు చైన్ లను సరఫరా చేసేవాడు. నమ్మకంగా పని చేస్తూ జీరోలో బంగారం రవాణా చేస్తుండడంతో అతన్ని నమ్మి కోట్ల రూపాయలు అప్పగించినట్లు తెలిసింది.

నిజామాబాద్ నగరంలో కుమార్ గల్లీ, గాంధీగంజ్ రోడ్డులోని బంగారు దుకాణాల రిటైల్ వ్యాపారులు హోల్ సేల్ వ్యాపారి టోకరా ఇవ్వడంతో షాక్ కు గురయ్యారు. 15 రోజులుగా హోల్ సేల్ వ్యాపారి దుకాణం తీయకపోవడం, ఫోన్ స్వీచ్చాఫ్ రావడంతో లబోదిబోమంటున్నారు. నగరంలోని ధర్మకాంట సమీపంలోని ఒక బంగారు వ్యాపారి హోల్ సేల్ వ్యాపారికి 3 కిలోల బంగారు నగల ఆర్డర్ కు సంబంధించి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. అదే ప్రాంతంలోని మరో వ్యాపారి కిలో బంగారం నగలకు ఆర్డర్ ఇవ్వడం గమనార్హం. మరో కాంప్లెక్స్ లోని వ్యాపారి కిలో బంగారు నగలకు ఆర్డర్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మరొక జ్యువెల్లర్ వ్యాపారి 50 లక్షల విలువైన చైన్ ల కోసం నగదును ముట్టచెప్పినట్లు తెలిసింది. కేవలం నిజామాబాద్ నగరంలోనే దాదాపు రూ.5 కోట్లు రిటైల్ వ్యాపారులకు నెత్తిన టోపి పెట్టాడు.

నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, భైంసా, కామారెడ్డి, ధర్మాబాద్, ముథోల్, నిర్మల్ వ్యాపారులు హోల్ సేల్ వ్యాపారి కోసం చక్కర్లు కొడుతున్నారు. కానీ ఎవరు కూడా ఫిర్యాదుకు ముందుకు రావడం లేదు. అందుకు కారణం జీరోలో బంగారం దందా సాగడమే కారణమని తెలిసింది. ఎక్కడ తాము డబ్బులు ఇచ్చింది బయటకు వస్తే తమ గుట్టు బయటకు వస్తుందోనని వ్యాపారులు భయపడిపోతున్నారు. గురువారం సైతం కొందరు వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి హోల్ సేల్ వ్యాపారి కోసం ఆరా తీయడం విశేషం. మరికొందరు తాము హోల్ సేల్ వ్యాపారికి డబ్బులు ఇచ్చింది వాస్తవమేనని కానీ అదంతా అసోసియేషన్ చూసుకుంటుందని దాటవేశారు. మరికొందరు ఫోన్ లలో స్పందించేందుకు ఇష్టపడకుండా లోలోపలే కుమిలిపోతున్నారు. తాజాగా వినాయక్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి తనకు రూ.20 లక్షల విలువైన బంగారు నగల కోసం ఆర్డర్ ఇవ్వగా హోల్ సేల్ వ్యాపారి కనిపించకుండా పోయాడని స్థానికంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు మాత్రం బహిర్గతం అయింది.