. . . గత ఏడాది పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య
. . . అటవి భూమి ఆక్రమణలు అడ్డుకున్న ఫారేస్ట్ సిబ్బందిపై దాడులు
. . . తాజాగా ఎక్సైజ్ శాఖ మహిళ కానిస్టెబుల్ పై హత్యాయత్నం
. . . ఆయుధాలు లేకుండా విధి నిర్వహణతో ప్రాణాల మీదకు వస్తున్న వైనం
. . . నిజామాబాద్ జిల్లాలో దారుణ పరిస్థితులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో యూనిఫాం సర్వీస్ ఉద్యోగుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. పేరుకు ఖాకీ దుస్తులు ధరిస్తూ విధులు నిర్వహిస్తున్న నేరస్థులు వారి పాలిట మ్రుత్యువుగా మారుతున్నారు. జిల్లాలో శాంతి భధ్రతలను, ప్రభుత్వ ఆస్తులను, సహజ సంపదను కాపాడేందుకు వారు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులో బైపాస్ రోడ్డులో ఈ నెల 23న సాయంత్రం ఎక్సైజ్ అధికారులు రూట్ వాచ్ చేస్తుండగా గంజాయి స్మగ్లర్ల కారును అపేందుకు ప్రయత్నిస్తుండగా ఢీ కొట్టి పరారీ అయ్యేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో మహిళ అబ్కారి కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ వ్యవహరం ఖాకీ యూనిఫాం ఉద్యోగుల జీవిత భవితవ్యాన్ని తేట తెల్లం చేసింది. గత ఏడాది అక్టోబర్ 17న రౌడిషీటర్ రియాజ్ ను పట్టుకునేందుకు వెళ్లిన నిజామాబాద్ సిసిఎస్ లో కానిస్టెబుల్ గా పనిచేస్తున్న ప్రమోద్ అతని చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అటవి శాఖ ఉద్యోగులు ఫారేస్ట్ భూమిని కాపాడేందుకు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రయత్నాలు చేయగా దాడులకు గురయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో యూనిఫాం సర్వీసులో విధి నిర్వహణలో అధికారుల కంటే కింది స్థాయి ఉద్యోగులు బలి అవుతున్నారు. అధికారులు, సిబ్బందికి ఆయుదాలు కేవలం పోలిస్ శాఖలో అందుబాటులో ఉండగా మిగిలిన యూనిఫాం సర్వీసులైన అబ్కారీ, ఫారేస్ట్, రవాణా, ఫైర్ శాఖలలో లేవు. అయితే పోలిస్ శాఖలో మాత్రం అధికారులకే ఆయుదాలు ఉంటుండగా, కిందస్థాయి సిబ్బందికి లాఠిలకు పరిమితమౌతున్నారు. మిగిలిన ఫారేస్ట్, రవాణా, అబ్కారీ, ఫైర్ ఉద్యోగులకు కనీసం లాఠీలు కాదు కదా ఎలాంటి ఆయుదాలు కూడా లేవు. దానితో వివిధ నేరాలు, కేసులలో సంబంధిత వ్యక్తులతో విధి నిర్వహణ కత్తిమీద సాములా మారుతుంది. వారు దాడులకు తెగబడిన కేవలం కేసుల నమోదు, ఫిర్యాదుకు పరిమితమౌతున్నారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు యూనిఫాం సర్విస్ ఉద్యోగులు పరుగులంగీంచుకునే పరిస్థితి నెలకోంది.
యూనిఫాం సర్వీస్ ఉద్యోగుల విధుల విషయంలో అధికారులు, సిబ్బందికి వివక్షత అనే విషయం ఎప్పటి నుంచో ఉంది. దానితో సహజంగా అధికారులు నేరస్థుల నుంచి దాడుల విషయంలో, కేసుల విషయంలో తప్పించుకుంటుండగా కిందిస్థాయి సిబ్బంది బలవుతున్నారు. గత ఏడాది రౌడిషీటర్ రియాజ్ చేతిలో సిసిఎస్ కానిస్టెబుల్ ప్రమోద్ హత్యకు గురి కావడంపై పలు ఆరోపణలు ఉన్నాయి. హైద్రాబాద్ కోర్టు విధులకు హజరైన ప్రమోద్ ను కావాలని కొందరు పాత నేరస్థుడు రియాజ్ ను పట్టుకునేందుకు పంపి అతడు హతుడు అవ్వడానికి కారకులు అనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఆనాడు అందుకు భాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా , ఇతరులను బదీలి చేసి బలి చేశారనే అపవాదు పోలిస్ శాఖ ముటగట్టుకుంది. గత ఏడాది అటవి శాఖలో ఒక రేంజర్ తో పాటు ఒక బీట్ ఆఫీసర్ ను పోడు భూమికోసం సహకరిస్తున్నారని అధికారులు సస్పెండ్ చేశారు. కానీ అంతకన్న ఇతర రెంజ్ పరిధిలో అటవి భూమి ఆక్రమణకు గురైతే కిందిస్థాయి సిబ్బందికి మెమోలు జారీ చేశారని, నార్త్ రేంజ్ పరిధిలో అటవి ఆక్రమణ దారుల చేతిలో దెబ్బలు తిన్నప్పటికి వారినే భాధ్యులు చేశారని అటవి శాఖ ఉద్యోగులు వాపోయారు. ఈ నెల 23న బైపాస్ రోడ్డులో అబ్కారీ శాఖ ఉద్యోగుల రూట్ వాచ్ విషయంలో కేసుల టార్గేట్ కోసం కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నారని ఎక్సైజ్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారుల విధి నిర్వహణ , సిబ్బంది విధి నిర్వహణలో వివక్షతను ఎత్తి చూపింది.