తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతిలో భారీగా చేరిన విద్యార్థి నాయకులు
హైదరాబాద్, బతుకమ్మ : సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతిలో భారీగా చేరిన విద్యార్థి నాయకులకు కవిత కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో శనివారం కవిత మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలన్నారు. సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుం బిగించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాకాకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కర్నాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి సీఎం సిద్దరామయ్యకు నేర్పించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని విమర్శించారు. సీఎం ఈ ప్రకటన చేసిన గంట సేపటికే కాంగ్రెస్ అధికారికంగా విడుదల చేసిన ఫోటోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారని, రేవంత్ రెడ్డి మాత్రం లేరన్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో అర్థమవుతోందన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారన్నారు. దర్శనాల సంగతి పక్కనబెట్టి ప్రజా సమస్యలపై సీఎం దృష్టిపెట్టాలని హితువు పలికారు. ఆర్ఎస్ఎస్ స్కూల్, టీడీపీ కాలేజీలో చదువుకున్నానని.. జాబ్ కాంగ్రెస్ లో చేస్తున్నానని సీఎం అన్నారని. చేస్తున్న జాబ్ లో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు రావడం లేదన్నారు. ఢిల్లీకి వెళ్లడంలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం మంత్రివర్గాన్ని కూర్పు చేసుకోలేని పరిస్థితి లో ఉన్నారన్నారు. ఇంత అసమర్థ, బలహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు రూ. 8 వేల కోట్ల మేర ఫీజు రియింబర్స్ మెంటు బకాయిలు ఉన్నాయన్నారు. తక్షణమే ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విద్య భరోసా కార్డులు పంపిణీ హామీని విస్మరిస్తోందన్నారు. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలని సూచించారు.
