Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 8:47 pm Posted by : ramakrishna

శాంతియుత వాతావరణం లో సమ్మె నిర్వహించుకోవాలి

 

. . . ప్రజా అశాంతికి గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్‌లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో చట్టాన్ని కాపాడటం పోలీస్ శాఖకు ప్రధాన ప్రాధాన్యతగా ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. సమ్మెను ప్రజాస్వామ్యపరమైన హక్కుగా గౌరవిస్తున్నప్పటికీ, అది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా, వారికి ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్సుల రాకపోకలు, డిపో ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు, బస్టాండ్ పరిసరాల్లో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమ్మెలో పాల్గొనే కార్మికులు, ప్రజలు పరస్పర గౌరవం పాటిస్తూ, ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీపీ కోరారు.