. . . విస్తారంగా వర్షాలు కురవాలని మహా వరుణయాగం
. . . పూర్ణాహుతి సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
నాగార్జునసాగర్, బతుకమ్మ :
రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, నదులు, ప్రాజెక్టులు, చెరువులు జలకళతో నిండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం సోమవారం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని, వేదపండితులు, రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలను ఏర్పాటు చేసి వరుణదేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమక్రతువులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు. దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన వరుణయాగంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలని, రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళతో కళకళలాడాలని, భూగర్భ జలాలు పెరగాలని, పంటలు పుష్కలంగా పండాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయమని ప్రభుత్వం పేర్కొంది. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికల ఆధారంగా ప్రభుత్వం ముందుకు సాగుతూనే.. వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహం కోసం వరుణదేవుడిని ప్రార్థించినట్లు తెలిపింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మహా వరుణయాగాన్ని నిర్వహించింది. ఈ పవిత్ర వరుణయాగ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువులతో నాగార్జునసాగర్ పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
