Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 8:16 pm Posted by : ramakrishna

అన్ని రకాల పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

 

. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రైతులు పండించిన అన్ని రకాల పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్‌ లోని ఎన్‌ఆర్ భవన్‌లో ఏఐకేఎంఎస్ నిజామాబాద్ డివిజన్ కమిటీ పరిధిలోని కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంతే పంటలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో పంటలను సేకరిస్తున్న విధంగానే తెలంగాణలో కూడా సేకరించాలని, విపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపకూడదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. “మేం ఇంతే కొంటాం, రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు” అనే విధానం రైతులను కార్పొరేట్ శక్తులు, మార్కెట్ దళారుల చేతుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని భూమయ్య హెచ్చరించారు. దీని వల్ల రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం యూరియా కొరత కారణంగా దుక్కులు దున్నుకుని నాట్లు వేసుకునే సమయంలో రైతులు సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైనంత యూరియా అందించకపోతే ప్రభుత్వాలకు రైతుల ఆగ్రహం తప్పదన్నారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందించాలని ఆయన కోరారు. అలాగే రైతులకు సరిపడా రుణాలు అందకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలు చెల్లిస్తూ నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే రుణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, వ్యాపని గంగాధర్, కే. సాయిలు, సరోజన, నర్సక్క, దొంపల్లి సాయిలు, ఎల్లవ్వ, సాయవ్వ, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.