Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 7:57 pm Posted by : ramakrishna

ఎస్‌.ఐ.ఆర్‌. ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

 

. . . బీ.ఎల్‌.ఓ లు ఇంటింటిని సందర్శిస్తూ సమగ్ర పరిశీలన జరపాలి

 

. . . రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

 

. . . కలెక్టర్లు, ఈ.ఆర్.ఓలు, ఏ.ఈ.ఆర్.ఓలతో వీడియో కాన్ఫరెన్స్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌.ఐ.ఆర్‌) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈ.ఆర్.ఓలు, ఏ.ఈ.ఆర్.ఓ లతో ఎస్‌.ఐ.ఆర్‌ ప్రక్రియ అమలు తీరుపై శిక్షణ, ఓటరు మ్యాపింగ్ పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 పర్యాయాలు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సీ.ఈ.ఓ తెలిపారు. ఎస్‌.ఐ.ఆర్‌ ప్రక్రియ ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, డబుల్/ డూప్లికేట్ ఎంట్రీల తొలగింపు జరుగుతుందని అన్నారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడుతుందని స్పష్టం చేశారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తిస్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని, అదే సమయంలో అనర్హులకు అవకాశం లేకుండా నిశిత పరిశీలన జరపాలని సూచించారు. ఒక కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చూడాలని, 1200 మంది ఓటర్ల సంఖ్య దాటితే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి బీ.ఎల్‌.వో వద్ద ఎన్యుమరేటర్ ఫారాలు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. బీ.ఎల్‌.ఓలకు ఎస్‌.ఐ.ఆర్‌ అమలు విధి విధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ గురించి, ఫారాల నిర్వహణపై పూర్తి అవగాహన ఏర్పడేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్రాఫ్ట్ జాబితా విడుదల అనంతరం మ్యాపింగ్‌లో లోపాలు ఉంటే సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. భారత పౌరసత్వ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూలై 1, 1987కు ముందు జన్మించిన వారు తమ స్వీయ గుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల పత్రాలు అవసరం లేదన్నారు. జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లి లేదా తండ్రి ఎవరిదైనా ఒకరి ధ్రువపత్రం సమర్పించాలని, డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రులు ఇద్దరి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ ఉంటుందని, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రచురించడం జరుగుతుందని సీ.ఈ.ఓ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్.డీ.ఓ రాజేంద్రకుమార్, బాన్సువాడ ఆర్.డీ.ఓ రవీందర్ రెడ్డి, బోధన్ ఆర్డీఓ విజయ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏ.ఈ.ఆర్.ఓలు పాల్గొన్నారు.

 

The SIR process should be conducted transparently.