Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 5:03 pm Posted by : ramakrishna

ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • కమ్మర్పల్లి, ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాలు తనిఖీ
  • ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

 

నిజామాబాద్, బతుకమ్మ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కమ్మర్పల్లి, ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియ అమలు, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు. 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత 2025 ఓటరు జాబితాను సరిపోల్చుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించారా అని పరిశీలించారు. నిర్దిష్ట గడువు లోపు ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

భూభారతి, గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఇంకనూ ఏవైనా అర్జీలు పెండింగ్ లో ఉంటే, వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఆయా మాడ్యూల్స్ లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, సాదాబైనామా అర్జీలలో ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి, పీ.ఓ.టీ భూములకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే, అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. చిన్నచిన్న కారణాల వల్ల దరఖాస్తులను రిజెక్ట్ చేయకూడదని, క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలన జరిపి అర్హులుగా నిర్ధారణ అయిన వారి దరఖాస్తులను ఆమోదించాలన్నారు. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే, అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని, అవి భూభారతి మార్గదర్శకాలకు లోబడి ఉండాలన్నారు. ఆమోదం పొందిన వాటితో పాటు తిరస్కరణకు గురైన సాదాబైనామా దరఖాస్తుల వివరాలను ఆన్లైన్ లో రెండు రోజులలోపు పూర్తి స్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పలు దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహసిల్దార్లు ప్రస్తావించిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేస్తూ, వాటిని ఏ మాడ్యుల్ లో పరిష్కరించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట కమ్మర్పల్లి తహసిల్దార్ ప్రసాద్, ఆర్మూర్ తహసిల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

The SIR process should be conducted strictly.

  •  ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన..

కాగా, వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను గమనించి, రైస్ మిల్లులకు వెంటదివెంట తరలించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తేమ శాతానికి లోబడిన ధాన్యాన్ని రైతులు కేంద్రానికి తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి మిల్లలకు పంపాలన్నారు. మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం అన్ లోడ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని, ట్రక్ షీట్లను ఎప్పటికప్పుడు తెప్పించుకుని ఓ.పీ.ఎం.ఎస్ లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల విషయంలో జాప్యానికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

The SIR process should be conducted strictly.