Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 5:47 pm Posted by : ramakrishna

ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి

 

. . . ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోఆర్డినేటర్లు యాదయ్య, ధనలక్ష్మి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఎ లు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం 94 శాతం ఓటరు మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసి ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి అమూల్యమని పేర్కొన్న ఆయన, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఓటు హక్కును బలహీనపరిచే ఎలాంటి చర్యలనైనా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)” పేరుతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి బీఎల్ఎ కీలక బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్లుగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటు హక్కు అత్యంత కీలకమని ఆయన అన్నారు. సమావేశం అనంతరం గ్రామాల్లో 100 శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బూత్ లెవల్ ఏజెంట్లను ఎమ్మెల్యే మదన్ మోహన్ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జులు, కోఆర్డినేటర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.