Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2024, 5:31 pm Posted by : ramakrishna

జాలరి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

  •  రంగంలోకి రిస్క్యూ టీం
     ఘటనా స్థలాన్ని పరిశీలించిన‌ జిల్లా ఉన్నతాధికారులు
     విషాదంలో కుటుంబ సభ్యులు

బతుకమ్మ, మాచారెడ్డి: ఎగువ మానేరు వాగులో గల్లంతైన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లోని లచ్చపేట గ్రామానికి చెందిన జాలరి కైరం కొండ శివరాములు ఆచూకీ ఊహాకందకుండా పోయింది. గల్లంతై 24 గంటలు గడిచినా అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆయన కుటుంబం లో విషాదం అలుముకుంది. ప్రమాదకర స్థాయిలో వాగు ప్రవహించడం తో రిస్క్యూ టీం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనీసం శవమైన లభిస్తుందో లేదోనన్న ఆందోళన ఆయన కుటుంబంలో నెలకొంది. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూ శర్మ ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. డీఎస్పీ, సీఐ ఘటనా స్థలం లో ఉండి పరిస్థితి ని పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. స్థానిక జాలర్లకు ఎయిర్ బ్యాగ్స్ అందజేసి గల్లంతైన శివరాములు ఆచూకీ కోసం తెప్పలపై గాలింపు చర్యలు చేపట్టారు. వరద ఉధృతి కారణంగా శివరాములు మృతదేహం కొట్టుకు పోయిందా…. లేక ఏదైనా ఒడ్డుకు చేరిందా అనే సందేహంతో గాలింపు చర్యలు మమ్మరం చేశారు. మాచారెడ్డి ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎగువ మానేరు వలుగు పరవళ్ళు తొక్కుతుండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పోలీసులకు కూడా స్థానిక ఎస్సై జాలరి శివరాములు గల్లంతు విషయమై సమాచారం అందించారు. వరద ఉధృతి తగ్గితే గాని శివరాములు ఆనవాళ్లు లభించే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

The search for the fisherman is ongoing