Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 4:44 pm Posted by : ramakrishna

జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువలేనిది

 

. . . పుల్వామా అమరవీరులకు ఘన నివాళి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశ సమగ్రతను కాపాడే జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవాడలో ఉన్న రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కార్యాలయంలో శనివారం పుల్వామా అటాక్ లో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న దేశ భద్రత కోసం విధుల్లో ఉన్న 40 మంది సైనికులు ఉగ్రదాడిలో అమరులైన ఘటన దేశ చరిత్రలో విషాద దినమని పేర్కొన్నారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా మాతృభూమి రక్షణను కర్తవ్యంగా భావించిన వీర సైనికుల త్యాగస్ఫూర్తి దేశ యువతకు ఆదర్శమని అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దేశ ప్రజలందరూ ఐక్యంగా నిలవాలని, దేశ భద్రతకు మద్దతుగా నిలిచే విధంగా ప్రజల్లో జాతీయ చైతన్యం పెంపొందాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం మరింత ఆర్థిక, సామాజిక భరోసా కల్పించాలని, వారి త్యాగాన్ని దేశం శాశ్వతంగా స్మరించుకోవాలని కోరారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనం పాటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి సైనికుడి త్యాగం భారత జాతి గర్వకారణమని, వారి స్ఫూర్తితో దేశం మరింత బలపడాలని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు బోడా అనిల్, నాయకులు గోపాల్ సింగ్ ఠాగూర్, సునీల్, ఆర్ వై ఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, నాయకులు చరణ్ లు పాల్గొన్నారు.