Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 6:28 pm Posted by : ramakrishna

సైబర్ నేరాలను ఎదుర్కొనడంలో యువత పాత్ర కీలకం

 

. . . పెరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

 

డిచ్‌పల్లి, బతుకమ్మ :

 

సైబర్ నేరాల పెరుగుదలను ఎదుర్కొనడంలో యువత, విద్యార్థులతో పాటు విద్యాసంస్థల పాత్ర కీలకమని, విద్యార్థుల డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు సైబర్ నేరాల నివారణలో ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి అన్నారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబి), హైదరాబాద్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్‌లో సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్ పై బుధవారం వర్క్‌ షాప్ నిర్వహించారు. విద్యార్థులు, మీడియా ప్రతినిధుల్లో సురక్షిత డిజిటల్ వినియోగంపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి హాజరయ్యారు.

 

The role of youth is crucial in combating cybercrime

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ హైజీన్ అంటే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, నెట్‌వర్క్‌ లను బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో ఉపయోగించడం అని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత డిజిటల్ అలవాట్లు అవలంబించాలని సూచించారు. పీఐబీ హైదరాబాద్ డిప్యూటీ  డైరెక్టర్ డా. మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఈ వర్క్‌ షాప్ విద్యార్థులు, మీడియాను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన తొలి హైబ్రిడ్ కార్యక్రమమని తెలిపారు. విద్యార్థులను సైబర్ అవేర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ లక్ష్యమని వివరించారు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సైబర్ మోసాల ద్వారా సంవత్సరానికి సుమారు ₹60,000 కోట్లకు పైగా మోసాలు నమోదవుతున్నాయని, తెలంగాణలో గత సంవత్సరం సుమారు ₹1,600 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 2024 లో రూ.16 లక్షలు, 2025లో రూ.19 లక్షలు మోసం జరిగిందని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచేందుకు ముందుకు రావాలని, సమష్టి అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాంబాబు, డైరెక్టర్ & ప్రిన్సిపాల్, యూసీఏఎస్ డా. ఎన్. స్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇంగ్లీష్ విభాగం జి. కోటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ శివచరణ్ రెడ్డి, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్, పీఐబీ హైదరాబాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

The role of youth is crucial in combating cybercrime