- పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ప్రజల ఆకాంక్ష, విద్యార్థుల పోరాట ఫలితంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారని పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ అన్నారు. నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్థూ నిజామాబాద్ నగరంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ రావడం జిల్లాలోని విద్యార్థులకే కాకుండా, చుట్టుపక్కల ఉన్న జిల్లాల విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు టెక్నికల్, ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందుబాటులో ఉండాలని కొన్ని సంవత్సరాలుగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ వస్తున్నదన్నారు. నగరంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేసిందన్నారు. ఎమ్మెల్యే, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, జిల్లా కలెక్టర్లకు, విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లకు, రాష్ట్ర విద్య కమిషన్ చైర్మన్లకు అనేకమార్లు విన్నవించడం జరిగిందన్నారు. ఎట్టకేలకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడం, వెంటనే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు మీడియా మిత్రులకు ఉద్యమాభినందనలు తెలియజేసారు. ఇంజనీరింగ్ కోర్సులకు సరిపడా ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలను కల్పించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు నసీర్, సృజన్, వివేక్,హర్షిత్,చరణ్ తేజ, శీను, సాయి, విజయ్, గణేష్, రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.