. కమిటీ సభ్యులకు సమాచారం లేకుండా రిజిస్ట్రేషన్
. సమావేశానికి గైరాజరైన నలుగురు సభ్యులు
కామారెడ్డి, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీ వీరాంజనేయ ఆలయానికి సంబంధించిన స్థలాన్ని ట్రస్టుకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని, నూతన ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు పూర్వాధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నూతన కమిటీ సభ్యులతోపాటు భక్తులు శుక్రవారం సమావేశమయ్యారు. సీతారామాంజనేయ దేవస్థానం న్యాయ సలహాదారులు, న్యాయవాదులు సీతారాములు, నాగభూషణం మాట్లాడుతూ.. సర్వే నంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ అధికారి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని అలాగే కమిటీ సభ్యులను, భక్తులను సంప్రదించకుండా ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలని శుక్రవారం సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశానికి కేవలం పూర్వ అధ్యక్షుడు సేల రాములు మాత్రమే హాజరై మిగతా నలుగురు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గుడి ఏ ఒక్కరి సొత్తు కాదని వార్డు సభ్యుడు మోటూరి శ్రీకాంత్ అన్నారు. గత 25 సంవత్సరాలుగా చీర రాములే అధ్యక్షులుగా కొనసాగుతూ గుడికి సంబంధించిన వివరాలన్నీ ఆయన వద్దే ఉన్నాయని, గత మూడు నెలల క్రితం నూతన కమిటీని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం అయి మూడు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి లెక్కలు అప్పజెప్పకపోవడం, అలాగే నిల్వ ఉన్న డబ్బులను ఇవ్వకపోవడం ఏమిటని కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వెళ్లి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని సేర్ల రాములకు కమిటీ సభ్యులు సూచించారు. సమావేశంలో ఆలయ ముఖ్య సలహాదారులు అలిమిశెట్టి లక్ష్మరాజం, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండ అశోక్ గుప్తా, కార్యదర్శి నాగెల్లి శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి తమ్మి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.