Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 4:42 pm Posted by : ramakrishna

ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి

 

. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను మరింత బలోపేతం చేసి రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. ఆల్ ఇండియా ఐద్వా పిలుపులో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నందున పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. దీనివల్ల ఆకలి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను అందిస్తే ప్రజలపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఆహార భద్రత మెరుగుపడుతుందని ఐద్వా అభిప్రాయపడిందన్నారు. ఈ అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు దేశవ్యాప్తంగా ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, వాటిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని ఐద్వా నిర్ణయించినట్లు తెలిపారు. 2007 లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న సందర్భంలో ఐద్వా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించి ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మళ్లీ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఐద్వా మరోసారి ఉద్యమ బాట పట్టిందన్నారు. రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులను ప్రజలకు అందించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అడివాల అనిత, నగర కమిటీ సభ్యురాలు శ్రీదేవి, నాయకులు లలిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

 

The Public Distribution System needs to be strengthened.