. . . అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.రమేష్ బాబు అన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

అనంతరం సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.18000 అమలు జరుపుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు జరపటం లేదని మండిపడ్డారు. పైగా అంగన్వాడీ కేంద్రాలకు పోటీగా ప్రీ ప్రైమరీ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించడం, దీని మూలంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న నాలుగు సంవత్సరాల పిల్లలందరూ ప్రీ ప్రైమరీ కేంద్రాలకు తరలించాలని చూడటం మూలంగా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని వాపోయారు. అందువల్ల ప్రీ ప్రైమరీ కేంద్రాలను అంగన్వాడీ సెంటర్లకు కేటాయించాలని, కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్ అయిన వారికి గ్రాడ్యుటి ఇవ్వాలని, పెన్షన్లు మంజూరు చేయాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు అనేకసార్లు అధికారులకు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ, పట్టించుకోకపోవడంతో గాంధీ విగ్రహాలకి వినతి పత్రాలు ఇచ్చామని మహాత్మ గాంధీ ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగేటట్టు చూడాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం వహిస్తే రాబోయే కాలంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని అందుకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం నిజామాబాద్ ఆర్డిఓ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.స్వర్ణ, ప్రాజెక్టు నాయకులు వాణి, సునీత, లలిత, సరిత, జరీనా, సాజిత తదితరులతో పాటు సెక్టార్ లీడర్లు పాల్గొన్నారు.
