- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్, బతుకమ్మ : జూనియర్ డాక్టర్స్, నర్సులు పేదవాళ్ల కోసం పనిచేస్తున్నారని, అలాంటి జూనియర్ డాక్టర్స్ డిమాండ్లు కొన్ని ఉన్నాయని వాటిని ప్రభుత్వం తీర్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనం బాటలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ లోని రిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పరిశీలించి రోగుల ఇబ్బందులు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక్కడున్న జూనియర్ డాక్టర్స్, నర్సులు పేదవాళ్ల కోసం పనిచేస్తున్నారన్నారు. పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నారని తెలిపారు. హాస్పిటల్ లో శానిటేషన్ చాలా దారుణంగా ఉందని, చాలా వాసన వస్తుందని తెలిపారు. దీని గురించి డైరెక్టర్ కు చెప్పామని, పాత ఏజెన్సీ మార్చామని చెప్పారని తెలిపారు. గతంలో శానిటేషన్ కోసమే ప్రత్యేక బడ్జెట్ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశారు. ఇక జిల్లాలో కార్డియాక్ అరెస్ట్ తో చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు రావాలంటే చాలా సమయం పడుతుందన్నారు. హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ ను కచ్చితంగా నియమించాలని డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున క్యాన్సర్ కేసులు కూడా నమోదవుతున్నాయన్నారు. ఇన్ని అడవులతో మంచి వాతావారణం ఉన్న జిల్లాలో క్యాన్సర్ కేసులు రావటమా? పెద్ద ఎత్తున పెరుగుతున్న క్యాన్సర్ కేసులపై కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. రిమ్స్ హాస్పిటల్ లో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. వారికి సరైన రెస్ట్ రూమ్స్, ఫెసిలిటీస్ లేవని అన్నారు. మన తెలంగాణ ఆరోగ్యాన్ని కాపాడే విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆరోగ్య శాఖకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించాలి. హాస్పిటల్ లో ఒక లిప్ట్ పనిచేయకపోవటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మంది మైనార్టీ వర్గానికి చెందిన వారు హాస్పిటల్ కు వస్తున్నారు. వారికి మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వం త్వరితగతిన హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
