Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 8:05 pm Posted by : ramakrishna

ధాన్యం అమ్ముడు పోక సరిహద్దు గ్రామ రైతుల సతమతం

 

. . . లారీలను పంపాలని తహసీల్దార్ కు వినతి పత్రం

 

లింగంపేట్, బతుకమ్మ :

 

మెదక్ జిల్లా సరిహద్దు గ్రామమైన కొత్తపల్లి గ్రామస్తులు యాసంగిలో పండించిన వరి ధాన్యం అమ్ముడు పోక పోవడంతో రైతులు సతమతం అవుతున్నారు. తాము పండించే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తూకా లు వేయించి లారీలను పంపాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం మెదక్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన 100 మంది రైతులు లింగంపేట తహసిల్దార్ కార్యాలయనికి తరలివచ్చారు. లారీలను పంపి వరి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని కోరుతూ వారు స్థానిక తహసిల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. రానున్న ఖరీఫ్ సీజన్లో కొత్తపల్లి గ్రామంలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వారు తహసీల్దారుకు విన్నవించారు. అటు మెదక్ జిల్లాకు సరిహద్దు గ్రామమైన కొత్తపల్లి ఇటు కామారెడ్డి జిల్లాకు సరిహద్దు గ్రామమైన పోల్కంపేట గ్రామాలు రెండు పక్కనే ఉన్నాయి. కొత్తపల్లి గ్రామ రైతులకు చెందిన సుమారు 400 ఎకరాల వ్యవసాయ భూములు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. వీరు గత దశాబ్దాల కాలంగా పంటలు పండించి పోల్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తుంటారు. ఈ యాసంగి సీజన్లో సైతం కొత్తపల్లి గ్రామ రైతులు లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించారు. కానీ కాంటాలు వేగంగా కాకపోవడం, లారీలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు నిలువ ఉన్నాయి. 40 రోజులు గడిచిన ధాన్యం తూకాలు కాకపోవడాన్ని నిరసిస్తూ తాసిల్దార్ ఆఫీస్ కి తరలివచ్చి వినతి పత్రం అందజేశారు. కొత్తపల్లి గ్రామ రైతులకు చెందిన వ్యవసాయ భూములు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట రెవెన్యూ శివారులో ఉన్నందున కామారెడ్డి జిల్లాకు చెందిన అధికారులే కొనుగోలు చేస్తారని మెదక్ జిల్లా సివిల్ సప్లై అధికారులు కొత్తపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రమును ఏర్పాటు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా అధికారులు ఏమో మీ గ్రామం మెదక్ జిల్లా పరిధిలో ఉన్నదని, మేము ధాన్యం కొనుగోలు చేయమని అక్కడికి లారీలను పంపలేమని చెబుతున్నార ని వారు తహసిల్దార్ సురేష్ కు వివరించారు. గత కొన్నేళ్లుగా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామ శివారులో కొత్తపల్లి గ్రామ రైతులు పండించిన వరి ధాన్యమును శెట్పల్లి సంగారెడ్డి సొసైటీ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా సొసైటీ అధికారులే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. లారీలు రాని కారణంగా హమాలీలు వెళ్లిపోతామని చెబుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో కొత్తపల్లి గ్రామంలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వారు తాసిల్దార్ కు విన్నవించారు. అందుకు తాసిల్దార్ సురేష్ సానుకూలంగా స్పందించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రేపటి నుండి లారీలను పంపిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.