Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 9:36 pm Posted by : ramakrishna

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ అప్రజాస్వామికం

 

. . . మండల బీజెపి ప్రెసిడెంట్ అరె రవీందర్

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు బహిరంగ ప్రకటన చేసిన దరిమిలా, ఎమ్మెల్యే తన నివాసంలోనే ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామియిక చర్య అని భీమ్ గల్ మండల బీజేపీ ప్రెసిడెంట్ అరె రవీందర్ అన్నారు. సోమవారం ఉదయం మండల బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చెసిన నేపథ్యం లో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన సవాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఎలాంటి తప్పు చేయని బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులను ఉపయోగించి ముందస్తు అరెస్టులు చేయించడం రాజకీయ కక్షసాధింపునకు నిదర్శనమన్నారు. తనతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యోగేశ్వర నర్సయ్య, భీమ్‌గల్ టౌన్ అధ్యక్షులు కనికరం మధు,విశ్వ హిందూ పరిషత్ నాయకులు బోనికె రజనీకాంత్ లను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో ఉంచడం అత్యంత ఖండనీయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కును పోలీసుల ద్వారా అణచివేయాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను పోలీసుల ద్వారా భయపెట్టాలని ప్రయత్నించడం వల్ల బీజేపీ నాయకులు వెనక్కి తగ్గరని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే రాజకీయ కక్షసాధింపు చర్యలను విరమించుకుని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.