Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 7:07 pm Posted by : ramakrishna

పీఆర్సీ అమలు చేసి, పెండింగ్ డీఏలు విడుదల చేయాలి

 

. . . డిచ్‌పల్లి మండలంలో డీటీఎఫ్ సభ్యత్వ నమోదు

 

. . . డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శంతన్

 

డిచ్‌పల్లి, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కొత్త పీఆర్సీని అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శంతన్ డిమాండ్ చేశారు. డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం డిచ్‌పల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం, పెండింగ్ డీఏలను విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కోల్పోతున్నారని విమర్శించారు. ఎన్నికల హామీల మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు దాటినా విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫారాలు అందలేదని, మరోవైపు అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా బోధన తీవ్రంగా ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఖాళీగా ఉన్న పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను తక్షణమే నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పీహెచ్‌ఎస్ (హెల్త్ స్కీమ్) సౌకర్యాల అమలులో జరుగుతున్న జాప్యం ఆందోళనకరమని, స్పష్టమైన విధివిధానాలతో ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కోరట్‌పల్లి, సుద్దులం, మిట్టపల్లి, సాంపల్లి తదితర గ్రామాల పాఠశాలలను సందర్శించారు. ఈ పర్యటనలో డీటీఎఫ్ జిల్లా నాయకులు రాసరి పెంటన్న, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

 

The PRC must be implemented, and pending DAs released.