. . . టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్
కామారెడ్డి, బతుకమ్మ :
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న టీపీటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చింతల లింగం అధ్యక్షతన శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాట కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి తహసీల్దార్లకు మెమోరాండాలు సమర్పిస్తామని, ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడతామని చెప్పారు. పీఆర్సీ ప్రకటించే వరకు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 21 నుంచి 26 వరకు రాష్ట్ర, జిల్లా స్థాయి బృందాలు పర్యటించి జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తాయని, ఆగస్టు 29న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఉపాధ్యాయులతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు చింతల లింగం మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియ పారదర్శకంగా, జీవో నంబర్ 25 నిబంధనలకు అనుగుణంగా జరగాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారంపై ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రాథమిక పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రాథమిక విద్యకు నష్టం కలిగించే జీవో 25ను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. నూతన జిల్లాలకు డీఈఓలు, రెవెన్యూ డివిజన్లకు డిప్యూటీ ఈఓలు, అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని, పీవో 2018కు అనుగుణంగా సర్వీస్ నిబంధనలు రూపొందించి పర్యవేక్షణాధికారుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, టెట్‌లో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని, స్పెషల్ టెట్‌ను సబ్జెక్టుల వారీగా పేపర్లతో నిర్వహించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి, మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్‌ను విద్యాశాఖలో విలీనం చేయాలని, కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. జీవో 317 బాధితులకు న్యాయం చేయడంతో పాటు జీవో 190ను అమలు చేయాలని, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను తెప్పించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను ప్రతి నెలా రూ.2 వేల కోట్ల చొప్పున విడుదల చేసి, హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిర్వహించిన నిరసన విజయవంతమైందని నాయకులు తెలిపారు. పీఆర్సీ ప్రకటించే వరకు ప్రతిరోజూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు తృప్తి వాసు, జిల్లా కార్యదర్శులు నాగభూషణం, నరేందర్, గోపు శ్రీనివాస్, సోలేటి నారాయణ, హరీష్, ఫెడరేషన్ సీనియర్ నాయకులు కందుకూరి శ్రీనివాస్, రాజశేఖర్, కృష్ణమూర్తి, సునీల్ కుమార్, కామారెడ్డి మండల అధ్యక్షుడు గ్యార బాబయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, గాంధారి మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, అశోక్ బలరాం తదితరులు పాల్గొన్నారు.