Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 10:42 pm Posted by : ramakrishna

స్తంభం విరిగింది ఆగష్టులో.. కేసు నమోదు జనవరిలో..

బేరం చెడడంతో ఐదు నెలల తర్వాత ఎఫ్ఐఆర్
ఆర్మూర్ విద్యుత్ శాఖాధికారుల తీరిది

నిజామాబాద్, బతుకమ్మ:

సంస్థకు ఇతరుల నుంచి నష్టం వాటిల్లితే ముందుగా కేసు నమోదు చేయించి, దానికి తగిన పరిహారం తీసుకుంటారు. ఇక్కడ అయిదు నెలల తర్వాత కేసు నమోదు చేయించిన సంఘటన విద్యుత్ శాఖలో జరిగింది. ఆర్మూర్ లోగల ఆసుపత్రులున్న ప్రాంతంలో విద్యుత్ పోల్ కు డిసిఎం వాహనం డీ కొట్టింది. శాఖ నిబంధనల ప్రకారం ముందుగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించాలి. సంస్థకు నష్టం కలిగించిన డ్రైవర్ తో బేరం కుదుర్చుకుంటే గిట్టుబాటు అవుతుందనుకొని, స్టేషన్ లో రాత పూర్వక ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ గాకుండా నిలిపివేయించారని సమాచారం. కథ అడ్డం తిరగడంతో గత్యంతరం లేక ఐదు నెలల తర్వాత కేసు నమోదు చేయించారు.

ఆగస్ట్ లో విరిగితే ..

విద్యుత్ స్తంబానికి ఆగష్టు లో వాహనం డీ కొట్టగా, దీనివల్ల సంస్థకు నష్టం వాటిల్లింది. ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు ఉండడంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. నష్టం కలిగించిన డ్రైవర్ తో మంతనాలు జరిపారు. దూర ప్రాంతం నుంచి వచ్చానని, రూ. 10 వేలు ఇస్తానని ఒప్పుకున్నట్లు తెలిసింది. విరిగిన స్తంబం స్థానంలో పునరుద్దరణ పనులను హుటాహుటిన గావించారు. ఎస్టిమేషన్ వేయడంతో రూ.16 వేలకు చేరుకుంది. వీటిని తీసుకుందామని విద్యుత్ సిబ్బంది వాహన డ్రైవర్ ను సంప్రదించగా, తాను ఒప్పుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఎఫ్ఐఆర్ జనవరిలో …..

దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు కుక్కలు మొరిగిన చంధంగా స్తంబం ఆగష్టులో విరిగితే, జనవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన ఘనత విద్యుత్ శాఖకే చెల్లింది. ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే ముందస్తుగా ఫిర్యాదు చేసి మిన్నకుండిపోయారు. నష్టం కలిగించిన వ్యక్తి అనుకూలించక పోవడంతో దానికి సంబందించిన వర్క్ ఆర్డర్ అలాగే ఉండిపోయింది. ఈ విషయం ‘బతుకమ్మ’ కదిలించడంతో ఎటు పాలుపోని స్థితిలో సబ్ డివిజన్ అధికారి సూచన మేరకు జనవరి 24న ఎఫ్ఐఆర్ (40/2025) నమోదు చేయించినట్లు తెలిసింది. దీనిని ఆధారం చేసుకొని మళ్ళీ ఎస్టిమేషన్ వేసి శాఖకు శఠగోపం పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్మూర్ డివిజన్ లోని సిబ్బంది చర్చించుకుంటున్నారు.