- ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్న జనం బాట
- తెలంగాణలోని అన్ని జిల్లాలో సాగనున్న పాదయాత్ర
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 25నుంచి జనం బాట (పాదయాత్ర) కార్యక్రమాకి శ్రీకారం చుట్టనున్నారు. తన సొంత జిల్లా నిజామాబాద్ నుంచి కవిత జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు గురువారం యాదగిరిగుట్టలో ప్రకటించారు. జిల్లాలో కవిత జనం బాట కార్యక్రమానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఖరారైంది. నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించి ఫిబ్రవరి 13 వరకు జనం బాట కారక్రమం జరుగనుంది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో జనంబాట చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదలైన తరువాత కవిత ఈ ఏడాది దూకుడు పెంచారు. బీసీలకు రిజర్వేషన్ ల కోసం ఉద్యమం చేపట్టింది కవితనే. తరువాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తు, నిరుద్యోగులు, గ్రూప్స్ విద్యార్ధుల కోసం ఆందోళనలు చేపట్టారు. తరువాత కాలంలో ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో అవినీతిపై చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. దానితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితను పార్టీనుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దానితో కవిత తనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవి వద్దని రాజీనామా చేశారు. కాని ఇప్పటికి అది ఆమోదం పొందలేదు. ఇటీవల కాలంలో కవిత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలలో దూసుకుపోతున్నారు. ఒక దశలో కొత్త పార్టీ పెడుతారని ప్రచారం జరిగింది. దాని గురించి గురువారం యాదాద్రిలో ప్రజలు కోరితే పార్టీ పెడుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకోవడానికి, తన వెంట వచ్చే వారికోసం, ప్రజలు పడుతున్న కష్ట నష్టాలను తెలుసుకునేందుకు కవిత జనం బాట పట్టినట్టు చెబుతున్నారు అనుచరులు.
ఈనెల 25న ఇందల్వాయి టోల్ గేట్ నుంచి బైక్ ర్యాలీ ద్వారా ఘన స్వాగతం పలికేందుకు జాగృతిశ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. నిజామాబాద్ నగరానికి చేరుకొని అనంతరం నవీపేట మండలం యంచ నుంచి జనం బాట కార్యక్రమాన్ని కవిత ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం సిహెచ్ కొండూరు ఆతర్వాత బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో రెండు రోజుల పాటు జనం బాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జాగృతి నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.