- వ్యాపారంలో దివాలా తీయడంతో చోరి
- మహ్మదీయ కాలనీలో చోరీ కేసును చేదించిన పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వ్యాపారంలో నష్టాలు రావడంతో తమ్ముడి వద్ద ఉన్న సొమ్ముపై కన్నేసి అతని ఇంట్లో చోరికి పాల్పడ్డాడు అన్న. పది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహ్మదీయ కాలనీలో జరిగిన భారీ చోరి కేసును చేదించినట్లు నిజామాబాద్ నగర సిఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6న మహ్మదీయ కాలనీకి చెందిన మహ్మద్ సాబిక్ పాషా తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికెళ్లాడు. తెల్లవారున తిరిగి రాగా తాళాలు బద్దలుకొట్టి ఉండడం, నగదుతో పాటు బంగారం చోరికి గురి కావడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో ఇంటి ప్రక్కనే ఉన్న అతడి సోదరుడిపై అనుమానంతో విచారణ జరిపారు. ఇటీవల కాలంలో వ్యాపారంలో మహ్మద్ షాబీర్ పాషా అన్న అయిన మహ్మద్ షఫీ పాషా దివాలా తీసినట్లు గుర్తించారు. అప్పులు పెరిగి చెల్లించడంలో ఇబ్బంది పడడంతో తమ్ముడు ఇంటికి తాళం వేసి వెళ్లగానే పథకం ప్రకారం తమ్ముడి ఇంటి తాళం పగుల గొట్టి రెండు తులాల బంగారు ఉంగరాలు, 7 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో మహ్మద్ షపీ పాషాను అరెస్టు చేసి అతని వద్ద నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చాకచక్యంగా చేదించడంలో రెండవ టౌన్ ఎస్ హెచ్ వో షేక్ ముజాహిద్ తో పాటు పోలీసులను సీపీ సాయిచైతన్య అభినందించినట్లు తెలిపారు.