Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 6:26 pm Posted by : ramakrishna

బాలబాలికలను సంరక్షించడమే ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యం

 

. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన తప్పిపోయిన, అపహరించబడిన, బాల కార్మికులుగా ఉన్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షణలోకి తీసుకోవడమే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశ్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ – XII కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, జూలై 1వ తేదీ నుంచి జూలై 31 వ తేదీ వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 119 మంది బాలలను పోలీసులు గుర్తించారని ఆయన తెలిపారు. ఈ రకంగా గుర్తించిన పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, తల్లిదండ్రులు లేని పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్ – XII లో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి బాలలను గుర్తించారు. వీరి వివరాలను “ట్రాక్ చైల్డ్”లో నమోదు చేసి, తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 48 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 19 ఎఫ్‌ఐఆర్‌లు, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 15 ఎఫ్‌ఐఆర్‌లు, బోధన్ డివిజన్ పరిధిలో 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. గుర్తించిన బాలల్లో నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 43 మంది, బోధన్ సబ్ డివిజన్ పరిధిలో 49 మంది, ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 27 మంది ఉన్నారు. మొత్తం 119 మంది బాలలను గుర్తించి వారి భద్రత, సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలల రక్షణ కోసం నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతం కావడంలో కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.