. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
నిజామాబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ (ఎన్‌సీఎస్‌ఎఫ్)ని వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు సీపీఎం జిల్లా ప్రతినిధి బృందం ఫ్యాక్టరీని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వెంకట్రాములు మాట్లాడుతూ 2008 వరకు విజయవంతంగా నడిచిన నిజామాబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు బోధన్ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూతపడ్డాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడమే కాకుండా, ఇప్పటికే నిలిచిపోయిన నిజామాబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే నిజామాబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కూడా తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

వేలాది మంది రైతుల భాగస్వామ్యంతో నిర్మించబడిన ఈ ఫ్యాక్టరీ గత 18 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై భవనాలు, యంత్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. ఫ్యాక్టరీ మూతపడటంతో రైతులు చెరుకు సాగును వదిలి ఇతర పంటల వైపు మళ్లారని, వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. అలాగే ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న చిన్న వ్యాపారులు, వృత్తిదారులు కూడా తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతమని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను కాపాడటంతో పాటు కొత్త పరిశ్రమలను స్థాపించడం ప్రభుత్వాల బాధ్యత అని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగ సమస్య తగ్గుతుందని, లేకపోతే యువత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు సహా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి చెరుకు పరిశ్రమలను పునరుద్ధరించాలని, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గత ప్రభుత్వాలు ఎదుర్కొన్న ప్రజా వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అంజయ్య, షంషుద్దీన్, దుర్గయ్య, గోవర్ధన్, గంగాధర్, రాజు, ఉద్భవ్, సుమలత తదితరులు పాల్గొన్నారు.
