Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 5:22 pm Posted by : ramakrishna

మోడీ సర్కార్ మానవ హననానికి పాల్పడుతోంది

 

. . . కాంగ్రెస్ లీగల్ సెల్ ఆందోళన

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా అందోళన చేస్తున్న విద్యార్థుల పై, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పై హింసాయుతరీతిలో మోడీ సర్కార్ వ్యవహారిస్తోందని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అందోళన వ్యక్తం చేసింది. నిజామాబాద్ జిల్లా కోర్టు చౌరస్తాలో మానవహారం ఏర్పడిన న్యాయవాదులు ఢిల్లీ లో అందోళన చేస్తున్న విద్యార్థులను వారికి అండగా నిలబడి ప్రధాన మంత్రి ఇంటి దగ్గర ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ పై కేంద్ర అజామాషిలో ఉండే ఢిల్లీ పోలీసులు మానవ హననానికి పాల్పడటం పట్ల కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు బైర గణేష్, ప్రధాన కార్యదర్శి దోన్పాల్ సురేష్ నిరసన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు ఇంటిదొంగనే ఇల్లు అంత దోచినట్టు ఉన్నదని అన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న విద్యార్థుల డిమాండ్ లో న్యాయమే ఉన్నదని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అండగా నిలబడటం వ్యవస్థకే అవమానకరమని వారు పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సమూలంగా సంస్కరించాల్సింది పోయి విద్యార్థుల పట్ల, ప్రజాస్వామిక సంస్థల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల హింసాత్మాక పద్దతిలో విరుచుకు పడటం క్షమించరాని నేరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యా పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని వారు, పేపర్స్ లీకేజిని అరికట్టలేని వారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు మామిళ్ల సాయరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్యామ్ బాబు,జీషాన్, రోహన్, మార్కెట్ కమిటీ సభ్యుడు న్యాయవాది నరేందర్ తదితరులు పాల్గొన్నారు.