. . . సామాన్య కార్యకర్తకు మేయర్ పీఠం దక్కడం కాంగ్రెస్ కే సాధ్యం
. . . రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ళ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్తను మేయర్ పీఠంపై కూర్చోబెట్టడం తమ పార్టీతోనే సాధ్యమౌతుందని అన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన, నిరుపేద కుటుంబం నంచి వచ్చిన సామాన్య కార్యకర్త కూరగాయల ఉమారాణిని మేయర్ పదవికి ఎన్నుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి నగరాన్నిదేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. 2005లో నిజామాబాద్ ఇంచార్జిగా ఉన్నప్పుడు మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకున్నామని మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత అదే బాధ్యతతో వచ్చి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయడం గర్వంగా ఉందని మంత్రి అన్నారు. ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు, పరిగి నుంచి కోదాడ వరకురాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ గెలుచుకుందన్నారు. అలాగే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలు మాత్రం అభివృద్ధి వైపే నిలిచారని పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌళిక సదుపాయల కల్పనకు వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నామని వెల్లడించారు. సమస్యలు ప్రభుత్వ దృష్టికి వచ్చిన 24 గంటల్లోనే పరిష్కారం చూపుతున్నామని, గత పదేళ్ళ పాలకులకు, తమకున్న తేదా ఇదేనని అన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో పేరుకపోయిన పూడికను తొలగించి, నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులను యుద్దప్రాతిపదికన చేపడుతామన్నారు. 20, 21 ప్యాకేజిల పనులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా నుంచి రికార్డు స్థాయిలో వరి సాగు, కొనుగోళ్ళు కాంగ్రెస్ హయంలోనే జరుగుతున్నాయని గుర్తు చేశారు. మతంపేరుతో సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు తెలంగాణలో తావులేదని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, గడుగు గంగాధర్, తాహెర్ బిన్ హందాన్, కేశ వేణు, నరాల రత్నాకర్ తదతరులు పాల్గొన్నారు.