- మహాయుతి కూటమిదే గెలుపు
- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశం మొత్తం తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీని మరాఠ ప్రజలు ఇక్కడ కూడా బొంద పెట్టాలని , మహాయుతి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహన్ తో కలిసి నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ బటల, బోర్గం గ్రామాలలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతు మరాఠ ప్రజలు మహాయుతి కూటమికి పట్టం కట్టడం ఖాయం అన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే లాడ్ కి బేహేన్ పథకం కింద 21 సంవత్సరాలనుండి 65 సంవత్సరాల వయస్సు గల ఆడబిడ్డలకు ప్రేమతో ఇచ్చే రూ.1500లను రూ.2100కు పెంచుతాం అని అన్నారు. బిజెపి అంటేనే రైతు పక్ష పార్టీ అని అన్నారు. కిసాన్ సన్మాన్ నిధి ద్వారా ఇప్పటికే రూ.12వేలు రైతులకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అధికారంలోకి రాగానే రూ.15వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతులకు వ్యవసాయానికి 7.5హెచ్ పీ కరెంటు ఉచితంగా అందిస్తామని తెలిపారు. పత్తి, సొయా పంటలకు హెక్టార్ కి ఐదు వేలు అదనంగా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. అన్ని మతాల వయో వృద్దులు తీర్థయాత్రలకు వెళ్లేందుకు రూ.30వేల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ కూడా అధికారంలోకి రాగానే రూ.1500లకు పెంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు బిజెపి నాయకులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, ఇల్లేందుల ప్రభాకర్, ఆనంద్, పవన్ ముందడ, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
