Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 4:37 pm Posted by : ramakrishna

మాజీ ముఖ్యమంత్రి అంజయ్య జీవితం స్ఫూర్తిదాయకం

 

. . . అంజయ్య విగ్రహానికి నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

 

హైదరాబాద్, తుకమ్మ :

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య 40వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని లుంబిని పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సామాన్య కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యున్నత పదవిని చేపట్టిన టి. అంజయ్య జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ నిరంతరం ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా అంజయ్య గుర్తింపు పొందారని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనసును చూరగొన్న నాయకుడిగా అంజయ్య నిలిచారని పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా పేరుపొందిన ఆయన, ప్రజల సమస్యలను ఓపికగా వింటూ, విమర్శలను సైతం సహనంతో స్వీకరించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని కొనియాడారు.నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ సామాన్య ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన అంజయ్య జీవితం నేటి తరం నాయకులకు మార్గదర్శకమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజలతో మమేకమై సేవ చేయడం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి విలువలను ఆయన జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు పాల్గొని టి. అంజయ్యకు నివాళులర్పించారు.