. . . బీఎల్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, యువజనులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీఎల్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న బీఎల్పీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పించిందని అన్నారు. అలాంటి రాజ్యాంగబద్ధ హక్కులను వినియోగిస్తున్న విద్యార్థులు, యువతపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్య అని విమర్శించారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులు, యువజనులు తమ గళాన్ని వినిపించడం నేరం కాదని దండి వెంకట్ స్పష్టం చేశారు. వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు, లాఠీచార్జ్ లు, అరెస్టులు, బెదిరింపులతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య దేశానికి తగదని అన్నారు. విద్యార్థులు, యువజనులపై లాఠీచార్జ్‌కు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే శాంతియుత నిరసన తెలిపే రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవించి, విద్యార్థి, యువజన సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడులు, నిర్బంధ రాజకీయాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలని, ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా విద్యార్థులు, యువజనుల స్వరం అణచివేయబడకూడదని దండి వెంకట్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీఎల్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్ధి రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత, కామారెడ్డి, సిద్దిపేట్, మెదక్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, నిర్మల్ జిల్లా కన్వీనర్ బోదాస్ గణేష్, నిజామాబాద్ నాయకుడు కాంబ్లే మధు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ మారోజు సునీల్ కుమార్‌తో పాటు వివిధ జిల్లాల నాయకులు చిట్యాల పోశవ్వ, డి. పొశెట్టి తదితరులు పాల్గొన్నారు.