- సీఐటీయు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు
వేల్పూర్, బతుకమ్మ : కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక కేంద్ర చట్టలకు వ్యతిరేకంగా ఈ నెల 9న నిర్వహించనున్న దేశ వ్యాప్త కార్మిక సమ్మెను కార్మిక సోదరులు విజయవంతం చెయ్యాలని సీఐటీయు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు కోరారు. బుధవారం మండల కేంద్రంలో కార్యక్రమ విజయవంతానికి గాను ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి, సమ్మె విజయవంతానికి మండల సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను పెట్టుబడిదారులకు కార్పొరేట్,కంపెనీలకు లాభాలు చేకూర్చే పనిలో భాగంగా నాలుగు కోడలుగా మార్చి 29 కార్మిక చట్టాలను హరించటం జరిగిందన్నారు. దీని ఫలితంగా యజమానులకు ప్రభుత్వానికి కార్మికులు కట్టు బానిసలుగా మారే పరిస్థితిలు ఏర్పడ్డాయని, కార్మికుల హక్కులను కాలరాయపడతాయన్నారు. ఇది పూర్తిగా మానవ హక్కులను హరించడమే అవుతుందని ఆయనఘాటుగా విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీలకు ప్రజాధనాన్ని కట్టబెట్టడం లక్ష్యంగా పనిచేస్తున్నారని, అందులో భాగంగా గత పది సంవత్సరాల కాలంలో 20 కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని రుణాలుగా ఇచ్చి మాఫీ చేశారన్నారు.దీని ద్వారా ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం చట్టాలను మారుస్తుందో అర్థం అవుతుందని ఆయన అన్నారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమై పేద, మధ్యతరగతి కార్మికుల వేతనాల్లో మాత్రం పెంచకపోవడం పైగా కనీస వేతనాలను ధరలకు అనుగుణంగా నిర్ణయించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రైవేటీకరించడం,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో తక్కువ వేతనాలతో కార్మికులను నియమించుకోవడం,ఉద్యోగ భద్రత కనీస సదుపాయాలు కల్పించకపోవడం జరుగుతుందన్నారు.వీటన్నిటికీ వ్యతిరేకంగానే ఈ సమ్మెను జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. సమ్మె జయప్రదం కొరకు సిఐటియు మండల సమన్వయ కమిటీ ని ఏర్పాటు చేశారు.మండల కన్వీనర్ గా వసంత ,కోకన్వీనర్ గా ఇందిరా, సభ్యులుగా వీణ, కవిత, నరసయ్య లను ఎన్నుకొన్నారు. ఈ సమావేశంలో మంజుల, మీనా కుమారి, శ్రావన్య, మంజుల,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.