మధ్యాహ్నం మంత్రి వర్గ విస్తరణ
సామాజిక వర్గాల కూర్పు నేపథ్యంలో రాని అవకాశం
మరికొన్ని రోజులపాటు ఇన్ చార్జి మంత్రి దిక్కు
మూడో విడత మంత్రివర్గ విస్తరణ పైనే ఆశలు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మలి విడత మంత్రి వర్గ విస్తరణ లో నిరాశ మిగిలింది. ఆదివారం జరుగనున్న మంత్రి వర్గం లో ఆశవాహులకు ఉమ్మడి ఇందుర్ జిల్లా నుంచి ఎవరి పేరు లేదు. ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణ లో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే డా గడ్డం వివేక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ధర్మపురి శాసన సభ్యులు అడ్లురి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చినట్టు తెలిసింది. రాజ్ భవన్ కు పిలుపు కోసం బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీలు ఆశపడిన విషయం తెలిసింది. ఉమ్మడి జిల్లా చెందిన కీలక నేతలు మొదటి విడత మంత్రివర్గ విస్తరణ నుంచి మంత్రి పదవి వస్తుందని ఆశపడుతున్న నిరాశ తప్పడం లేదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోసం అధిష్టానం వద్ద ఒత్తిడి తెస్తున్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు రెండోసారి కూడా నిరాశ తప్పలేదు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుడిగా మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవంతో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న బంధుత్వం నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి రెండో విడతలో మంత్రి పదవి ఖాయం అనుకున్న ఆయన అనుచరులకు కూడా నిరాశ తప్పలేదు. సుదర్శన్ రెడ్డి శనివారం ఢిల్లీకి ప్రయాణం కావడంతో ఆయన పేరు క్యాబినెట్ విస్తరణలో ఉంటుందని అనుకున్నప్పటికీ జాబితాలో పేరు లేక పోవడంతోని ఆయన హస్తినకు పయనమయ్యారని వాదనలు ఉన్నాయి. ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని వెలమ సామాజిక వర్గానికి కచ్చితంగా అవకాశం ఉంటుందని ఆశపడ్డారు. మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తనకు మైనార్టీ కోటాలో మంత్రి పదవి వస్తుందని గత రెండు పర్యాయాలుగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేగా ఓటమి చెందడంతో ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఆ విషయంలో ఇతరుల వైపు ఆసక్తిగా ఉందని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి జిల్లా మంత్రివర్గ విస్తరణలో అవకాశం లేకపోవడంతో ఇంచార్జి మంత్రిపాలన మరికొన్ని రోజులు తప్పదని చెప్పాలి. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి తగ్గకపోవడానికి రెడ్డిలలో, వెలమ సామాజిక వర్గంలో ఆశవాహుల మధ్య గట్టి పోటీ ఉండటం కారణంగా చెబుతున్నారు. మొదటి విడత మంత్రివర్గంలో పనిచేస్తున్న ఇద్దరిని తొలగిస్తారని వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఉంటుందని ప్రచారం జరిగిన దానిని ఏఐసీసీ వర్గాలు కొట్టి పారేశాయి. ప్రస్తుత మంత్రివర్గంలో అసంతృప్తి లేదని అందరూ ఐక్యంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కలిసి పని చేస్తున్నారని రాష్ట్ర ఇంచార్జ్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 18 నెలల తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటికీ మరో మూడు పదవులను భర్తీ చేయాల్సి ఉండడంతో ఉమ్మడి జిల్లాలో ఎవరికో ఒకరికి ఆలస్యమైన మంత్రి పదవి వస్తుందని ఆశతో చెబుతున్నారు.