నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో చోరీలకు గురైన పలు ఏటీఎంలను ఇన్ చార్జి సీపీ రాజేశ్ చంద్ర శనివారం పరిశీలించారు. కాగా, ఈతెల్లవారు జామున నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాంగ్రా బ్రాంచ్‌కు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏటీఎంను, ఐదవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి సుమారు రూ. 30లక్షల వరకు నగదు దోచుకెళ్లారు. ఈఏటీఎం ప్రాంతాలను పరిశీలించి ఇన్ చార్జి సీపీ రాజేశ్ చంద్ర మాట్లాడారు. చోరీ జరిగిన విధానం, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ సేకరణ, ఏటీఎం లోపలి, బయట పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను సేకరించి విశ్లేషణ చేయాలని ఆదేశించారు. పలు ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డ నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
ఐదు ప్రత్యేక బృందాల ఏర్పాటు..
ఏటీఎంల చోరీ నిందితులను పట్టుకునేందుకు క్లూస్ టీమ్, సాంకేతిక నిపుణులు, స్థానిక పోలీస్స్టేషన్ల సిబ్బందితో కలిపి ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో ముఖ్యంగా ఏటీఎంలు, బ్యాంకులు, జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మొబైల్ పెట్రోలింగ్ పెంచాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు.
