Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2024, 4:15 pm Posted by : ramakrishna

ఇంటింటి సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి

  • పరిశీలకులు అబ్దుల్ హమీద్ 
  • కలెక్టర్ తో కలిసి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష

నిజామాబాద్, బతుకమ్మ  : ఎస్ఎస్ఆర్-2025 లో భాగంగా ఓటరు జాబితా సవరణ కోసం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం నుండి పరిశీలకులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి గురువారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ కేంద్రాల తహశీల్దార్లు, ఎన్నికల విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ, ఇంటింటి సర్వే, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ ఏర్పాట్లు, స్వీప్ కార్యకలాపాలు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, దాఖలైన దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలలో నియోజకవర్గాల వారీగా ప్రగతిని సమీక్షిస్తూ, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 26 నాటితో గడువు ముగియనున్న దృష్ట్యా ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని, 100 శాతం సర్వే పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన బీఎల్ఓలను అవసరం ఉన్న చోట ఇతర పోలింగ్ కేంద్రాలలో సర్వే కోసం సర్దుబాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి తిరుగుతూ జాబితాను సరిచేయాలని, మరణించిన వారి పేర్లు తొలగించాలని, పేర్లు, చిరునామాలు వంటివి ఏవైనా మార్పులు ఉంటే, పక్కాగా నిర్ధారణ చేసుకుని బీఎల్ఓ యాప్ ద్వారా మార్చాలని సూచించారు. ఇంటింటి సర్వేకు వెళ్లిన సమయంలో ఎస్ఎస్ఆర్-2025 అని మార్కింగ్ చేయించాలన్నారు. 15 వందలు ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అలాంటి చోట కొత్తగా మరొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలైతే ఒకే ప్రదేశంలో రెండుకు మించి పోలింగ్ స్టేషన్లు ఉండకూడదని, పట్టణ ప్రాంతాల్లో 4 పీ.ఎస్ లకు మించి ఒకే లొకేషన్ లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశీలకులు అబ్దుల్ హమీద్ సూచించారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతి, కిరణ్మయి, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, సహాయ ఈఆర్ఓలు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.