Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 8:46 pm Posted by : ramakrishna

హత్యకు దారితీసిన ఈజీ మనీ ఆశ

 

. . . బెట్టింగ్ తో అప్పుల్లో కూరుకుపోయిన యువకుడి ఘాతుకం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఓ యువకుడు ఈజీ మనీ కోసం దారుణానికి పాల్పడ్డాడు. బెట్టింగ్‌లు, మద్యపానానికి అలవాటుపడి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన అతడు.. చివరకు ఓ వృద్ధురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. ఒకప్పుడు బెట్టింగ్ అంటే రహస్యంగా జరిగే వ్యవహారంగా ఉండేది. అయితే స్మార్ట్‌ ఫోన్లు, బెట్టింగ్ యాప్‌ల విస్తృతితో పరిస్థితి మారిపోయింది. కష్టపడకుండా త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో మొదట సరదాగా బెట్టింగ్ ప్రారంభించే యువత.. క్రమంగా దానికి బానిసలుగా మారుతున్నారు. ఆర్థిక నష్టాలు, అప్పుల ఒత్తిడి పెరగడంతో కొందరు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామానికి చెందిన ఐతనబోయిన ప్రశాంత్ (26) చికెన్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో పాటు మద్యపానానికి అలవాటుపడిన ప్రశాంత్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో తన షాప్ సమీపంలో నివసించే సుగుణ అనే వృద్ధురాలి బంగారు ఆభరణాలపై కన్నేశాడు. జులై 17 అర్ధరాత్రి సమయంలో సుగుణ ఇంటికి వెళ్లిన ప్రశాంత్.. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునేందుకు ప్రయత్నించాడు. అయితే సుగుణ గట్టిగా ప్రతిఘటించడంతో.. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌తో పాటు నల్లపూసల చైన్‌కు సంబంధించిన బంగారు బిళ్లలను తీసుకుని ప్రశాంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య అనంతరం దొంగిలించిన బంగారు చైన్‌ను ప్రశాంత్ తన బావమరిది, మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం బాలినిధర్మారం గ్రామానికి చెందిన సరగండ్ల మహేష్ (20) కు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మహేష్ ఆ బంగారు చైన్‌ను తన పేరుతో ఖమ్మంలోని ఓ బ్యాంకులో కుదువపెట్టి రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ హత్య, దోపిడీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆగస్టు 9న ఉదయం తిరుమలాయపాలెం రోడ్డులో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌తో పాటు అతనికి సహకరించిన సరగండ్ల మహేష్‌ను అరెస్ట్ చేశారు. బెట్టింగ్ వ్యసనం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న యువకుడు.. ఈజీ మనీ కోసం హత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రభావం, యువతలో పెరుగుతున్న వ్యసనం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.