Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 1:23 pm Posted by : ramakrishna

మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో ప్రభుత్వం చెప్పాలి

మహిళలది ఒకే కులం

సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, బతుకమ్మ: మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమాజం ఎదుగుదలలో మహిళల పాత్ర గణనీయంగా ఉందన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో  మహిళలు  రాజకీయంగా నష్టపోతున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. జనగణనకు బడ్జెట్ లో ఎందుకు నిధులు పెట్టలేదని ప్రశ్నించారు. ? జనగణన త్వరగా చేస్తే.. రాబోయే బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలవుతారన్నారు. ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామన్న  హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామన్నారు. మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా లేదానేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదన్నారు. కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారని గుర్తు చేశారు.  మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారన్నారు.  కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా, పురుషల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నారన్నారు.  అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉందన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉందని, అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణమన్నారు. మహిళలకు కులమతాలు లేవు.. మహిళలది ఒకే కులం అన్నారు.  మహిళలలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. ఇళ్లలో మహిళలు ద్వితియ శ్రేణి పౌరులుగా ఉంటున్నారన్న వాదన వీగిపోవాలన్నారు. అమెరికా 40 శాతం మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే భారత్ లో మాత్రం అది 17 శాతంగానే ఉందన్నారు.  దేశంలో 50 శాతం మహిళలు ఉద్యగాలు చేస్తే దేశ జీడీపీకి మనం 5 లక్షల కోట్ల ఆదాయం ఇవ్వగలుగుతామన్నారు. భూగర్భ గనులల్లో పనిచేయడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లే వరకు మహిళలు ఎదిగారన్నారు.  అనేక అవాంతరాలు ఉన్నా… వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.

The government should tell us how to make women millionaires.