. . . ధర్నా చౌక్ లో సిఐటియు నిరసన
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంలో అంగన్వాడి, ఆశ కాంట్రాక్ట్ వర్కర్స్ ఇతర కార్మికుల ను ఆందోళన చేయకుండా ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలను వీడనాడలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నా సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కాలం దగ్గర పడుతున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు జరపటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటం వలన తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కొరకు శాంతియుత పోరాటానికి పోలీసులను ప్రయోగించి ముందుగానే అక్రమంగా అరెస్టులు చేస్తూ పోలీస్ స్టేషన్లలో మహిళలని కూడా చూడకుండా నిర్బంధించి ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నేటి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబించే నిర్బంధాలను కాంగ్రెస్ పార్టీ అమలు జరపాలని చూడటం మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతుందని వారన్నారు. గత పాలకులకు కార్మిక వర్గం తమ పోరాటాలను అణచివేస్తే చెప్పిన గుణపాఠమే నేటి ప్రభుత్వానికి పడుతుందని వారు హెచ్చరించారు. నిర్బంధాల ద్వారా ఉద్యమాలను, పోరాటాలను అంచాలనుకోవటం అవివేకం అవుతుందని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ధోరణిని మార్చుకొని కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు జరపాలని అక్రమ అరెస్టులను, నిర్బంధాలను విడనాడాలని ప్రజాస్వామ్యంగా తమ సమస్యలను వెలిబుచ్చు అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల కార్మిక వర్గం మరింత సంఘటిత పోరాటాలకు సిద్ధపడాల్సి వస్తుందని బెదిరింపులను నిర్బంధాలను ఎదిరించటం సిఐటియుకు కార్మిక వర్గానికి కొత్తేమీ కాదని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జంగం గంగాధర్ ,స్వర్ణ, శ్రీనివాసరాజు, సాగర్, సుకన్య, శంషుద్దీన్ తదితరులతో పాటు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.