. . . పీడీఎస్ యు జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్
డిచ్‌పల్లి, బతుకమ్మ :
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యు జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాంపూర్‌లో డిచ్‌పల్లి మండల పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలను తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేయడం స్వాగతించదగ్గ విషయమన్నారు. పాఠశాలల అధికారిక వెబ్‌సైట్లలోనూ ఫీజుల వివరాలను అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం పారదర్శకతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అయితే కేవలం ఫీజుల వివరాలను ప్రదర్శించడం మాత్రమే కాకుండా, ప్రతి తరగతికి ఎంత ఫీజు వసూలు చేయాలనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ముందుగానే స్పష్టమైన ఫీజు పరిమితులు, మార్గదర్శకాలను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన విధానాలను ఆదర్శంగా తీసుకుని, తెలంగాణలోనూ ప్రతి తరగతికి సంబంధించిన ఫీజు పరిమితులను ప్రభుత్వం ముందుగానే ప్రకటించి, వాటిని పాఠశాలలు తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం అనేక ప్రైవేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫాం తదితర పేర్లతో తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని నాయకులు ఆరోపించారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే సమగ్ర ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తరగతి వారీగా ఫీజు పరిమితులను ప్రభుత్వం ప్రకటించాలని, అన్ని పాఠశాలలు నిర్దేశిత పరిమితుల్లోనే ఫీజులు వసూలు చేసేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే వాటి గుర్తింపును రద్దు చేయాలని కోరారు. విద్య వ్యాపారం కాదు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించి, విద్యార్థుల హక్కులను కాపాడేందుకు ఫీజుల నియంత్రణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని పీడీఎస్ యూ నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే. అషూర్, ఎండి. నసీర్, జిల్లా సహాయ కార్యదర్శి అల్గోట్ సృజన్, జిల్లా నాయకులు మణితేజ, కార్తీక్, మున్నా తదితరులు పాల్గొన్నారు.